© 2026 nimisham.in
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్ ల్యాండింగ్‌కు ఉన్న అవకాశాలపై కేంద్ర పౌర...
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్ ల్యాండింగ్‌కు ఉన్న అవకాశాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ అధ్యయనం చేస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను మరో రెండు వారాల్లో తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర శాఖ అధికారులు తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. రాజీవ్‌గాంధీ భవన్లో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు, హెలీ టూరిజం, సీప్లేన్ సేవలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్ మామునూరు విమానాశ్రయాల పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి ఇచ్చిందని ఆయన వివరించారు. ఇక మిగిలిన పనులను త్వరితగతిన చేపట్టి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన టెండర్లను రెండు వారాల్లో పిలిచి, డిసెంబర్ నాటికి ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎంకు తెలిపారు. అదే నెలలో విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం.ఆదిలాబాద్ విమానాశ్రయంలో కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా కార్గో, ప్యాసింజర్ టెర్మినల్‌తో పాటు ఎంఆర్ఓ (MRO) (Maintenance, Repair and Overhaul) సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులో రన్‌వేకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రన్‌వే అంశంపై ఉన్న సాంకేతిక అంశాలను త్వరగా పరిష్కరించి పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు హెలికాప్టర్ సేవలను వినియోగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ హెలీ టూరిజం అభివృద్ధికి కేంద్ర పౌర విమానయాన శాఖ సహకరించాలని కోరారు. హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వస్తే పర్యాటకులు తక్కువ సమయంలో వివిధ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుందని సీఎం పేర్కొన్నారు. తద్వారా తెలంగాణలో పర్యాటక రంగానికి మరింత ఊతం లభిస్తుందని వివరించారు.హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్ ల్యాండింగ్, టేకాఫ్‌కు ఉన్న అవకాశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై అధ్యయనం చేసి, సాధ్యాసాధ్యాలకు సంబంధించిన నివేదికను 2 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. సీప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి సమీప పర్యాటక ప్రాంతాలకు కొత్త తరహా కనెక్టివిటీ ఏర్పడే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సీప్లేన్ కార్యకలాపాలకు సంబంధించిన భద్రత, సాంకేతిక, పర్యావరణం వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.