© 2026 nimisham.in

షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు గ్రూప్ ఫొటో నుంచి భారత ప్రధాని మోదీ చిత్రాన్ని పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం ఎడిట్ చేసి తొలగించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రస్థాయిలో...
షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సు గ్రూప్ ఫొటో నుంచి భారత ప్రధాని మోదీ చిత్రాన్ని పాకిస్థాన్ ప్రధాని కార్యాలయం ఎడిట్ చేసి తొలగించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం చేసిన ఈ చిల్లర చేష్టలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఏక్ నాథ్ షిండే... పాకిస్థాన్ చేసిన పని అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. వారు ఫొటో నుంచి మాత్రమే మోదీ చిత్రాన్ని తొలగించగలరని... కానీ మోదీ అనుకుంటే ప్రపంచపటం నుంచి పాకిస్థాన్‌ను లేకుండా చేయగలరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గతంలో పహల్గామ్లో ఉగ్రవాదులు ఘోరానికి ఒడిగట్టినప్పుడు, మోదీ నాయకత్వంలో మన భారత సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను, 11 ఎయిర్‌బేస్ క్యాంపులను ధ్వంసం చేసి వారిని మోకాళ్లపై నిలబెట్టాయని గుర్తుచేశారు.
ఇటువంటి చవకబారు ట్రిక్కులతో భారత్‌తో కానీ, ప్రధాని మోదీతో కానీ ఆడుకోవాలని చూడవద్దని పాకిస్థాన్‌కు ఆయన హితవు పలికారు. కేవలం ఫొటో నుంచి మోదీని కట్ చేసినంత మాత్రాన దేశంలోనూ, అంతర్జాతీయ వేదికలపైనా ఆయనకు ఉన్న గుర్తింపు, స్థాయి ఎంతమాత్రం తగ్గబోవని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేశారు.